హీరో ఆశిష్ “రౌడీ బాయ్స్‌” ఫస్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుదల..!

Published on Aug 23, 2021 11:01 pm IST

తెలుగు ప్రేక్ష‌కులకు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం “రౌడీ బాయ్స్”. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేయగా, మోష‌న్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ సుకుమార్ విడుదల చేశాడు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వ‌ర్ జూబ్లీ ఇయ‌ర్‌ అని ఈ జ‌ర్నీలో తమకు ఎన్నో అనుభూతులున్నాయని అన్నారు. నిర్మాత కావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వి.వి.వినాయ‌క్ త‌న తొలి సినిమాను మా బ్యాన‌ర్‌లో చేసి రాజును కాస్త దిల్‌రాజుగా మార్చేశాడని అన్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నామని, ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కులు సుకుమార్‌, వంశీ పైడిప‌ల్లి, బోయ‌పాటి శ్రీను, శ్రీకాంత్‌, భాస్క‌ర్‌, వాసు వంటి వారిని ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేశామని అన్నాడు. మా ఇంట్లో నుంచి ఆశిష్ హీరో అవుతాడ‌ని తాము అనుకోలేదని, అయితే మా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌లో ఆశిష్ డాన్స్‌, ఎన‌ర్జీ చూసి హీరో అవ్వమని చెప్పామని, గ‌త మూడేళ్లుగా యు.ఎస్‌, బాంబే, వైజాగ్‌లో ఆశిష్ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడని అన్నాడు. తొలి సినిమాతో ఆశిష్‌ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌న్న ఆసక్తి తనలో కూడా ఉందని అన్నాడు. ఓ హీరోను ఇంట్ర‌డ్యూస్ చేయాలంటే ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ కావాలని అనుకున్నామని, డైరెక్ట‌ర్ హ‌ర్ష చక్కటి కథను ఇచ్చాడని, అంతేకాకుండా చాలా చక్కగా ఈ సినిమాను తీశాడని, అక్టోబ‌ర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని చెప్పాడు. మా బ్యాన‌ర్‌లో శ‌త‌మానం భ‌వ‌తి, హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే సినిమాలు చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారి అబ్బాయి విక్ర‌మ్ ఆశిష్‌కి అపోజిట్ రోల్ చేశాడని, అంద‌రూ చాలా చ‌క్క‌గా చేశారని అన్నారు.

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ ఆశిష్ హీరోగా స‌క్సెస్ కాక‌పోతే మ‌రో ఆల్ట‌ర్ నేట్ పెట్టుకోవాలని చెప్పానని దిల్‌రాజ్ అన్నాడని, కానీ ఆశిష్‌కు అవేం అక్క‌ర్లేదని, తను పెద్ద‌ హీరో కావాలని, ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కులంద‌రినీ తను ఎట్రాక్ట్ చేయాల‌ని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూశానని, ఆశిష్ చాలా బాగా చేశాడని, నాకెంతో ఇష్ట‌మైన ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారి అబ్బాయి కూడా ఇందులో నటించాడని, త‌న‌కు కూడా మంచి భ‌విష్య‌త్తు ఉండాల‌ని కోరుకుంటున్నానని, హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా చాలా బాగా చేసిందని అన్నాడు. డైరెక్ట‌ర్ హ‌ర్ష స‌హా ఈ సినిమాకు ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌న‌లు తెలియచేశాడు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ దిల్‌రాజుగారు చెప్పిన‌ట్లు నాకు వి.వి.వినాయ‌క్‌గారు సినిమా గురువు అని లెక్క‌లు టీచింగ్ చేసే నేను ఆది సినిమాను చూసి షాట్ డివిజ‌న్ ఎలా చేయాలన్నది నేర్చుకున్నానని, ఆర్య సినిమా చేయ‌డానికి అదే కార‌ణమని అన్నారు. కొత్త డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌నే సాహ‌సం దిల్‌రాజ్ గారు చేసుకుండ‌క‌పోతే నేనిక్క‌డ ఉండేవాడిని కాదని, ఈ విష‌యంలో ఆయనకు ఎప్పటికీ తాను రుణ‌ప‌డి ఉంటానని అన్నారు. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేసిన ఈ సంస్థ నుంచి ప‌రిచ‌యం అవుతున్న శిరీశ్‌గారి అబ్బాయి ఆశిష్‌కు ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ని ఇవ్వాల‌ని, సూప‌ర్బ్ హీరో కావాల‌ని కోరుకుంటున్నానని అన్నాడు. ఆశిష్, విక్ర‌మ్‌, అనుప‌మ‌ మరియు చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్‌ అని అన్నారు.

డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ మనం కాలేజీలో చేరిన కొత్తలో మనలో తెలియని ఓ ఎన‌ర్జీ ఉంటుందని, దాంతో మ‌న‌కు తెలియ‌కుండానే ర‌చ్చ చేస్తుంటామని, ఈ సినిమాలోనూ అంతే మా బాయ్స్ చాలా రౌడీ ప‌నులతో ర‌చ్చ చేస్తారు. దాని వ‌ల్ల ఏం జ‌రిగిందనేదే సినిమా. ఇండియాలోని టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారని, ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత అంద‌రూ ఆశిష్‌గారి నాన్న శిరీష్‌గారు అంటారనడం గ్యారంటీ అని, తనకు ఈ అవ‌కాశం ఇచ్చిన దిల్‌ రాజుగారికి చాలా థాంక్స్‌ అని అన్నారు.

హీరో ఆశిష్ మాట్లాడుతూ నా ఫస్ట్ మూవీ ఫస్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన వినాయ‌క్‌గారికి, సుకుమార్‌గారికి చాలా థాంక్స్‌ అని, అలాగే బాబాయ్‌కి, నాన్న‌కు కూడా థాంక్స్‌ అంటూ, మా ఫ్యామిలీలో నేను హీరో కావాల‌ని అనుకున్న మొద‌టి వ్య‌క్తి మా అనిత అంటీ అని కానీ ఆమె ఈరోజు ఇక్క‌డ లేరని, ఆమెను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌డం నా బాధ్య‌త‌. అలాగే మా కుటుంబ స‌భ్యుల స‌పోర్ట్ కూడా తాను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనని, నా ఫ్యామిలీ అందించిన స‌పోర్ట్ వ‌ల్ల‌నే ఈ రోజు నేను సినిమా చేయగలిగానని, అలాగే డైరెక్ట‌ర్ హ‌ర్ష నాతో మంచి సినిమా చేశాడని, ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని అన్నాడు.

హీరోయిన్ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ నేను ఈ బ్యానర్‌లో చేసిన మూడో సినిమా ఇది అని, శ‌త‌మానం భ‌వ‌తి స‌మ‌యంలో నేను ఆశిష్‌ను క‌లిసిన‌ప్పుడు, ఇద్ద‌రం మాట్లాడుకుంటుంటే త‌ను హీరో అవుతాన‌ని అన్నాడని, కానీ త‌ను హీరోగా చేసిన ఈ సినిమాలో నేను పార్ట్ అవుతాన‌ని అప్పుడు అస్స‌లు అనుకోలేదని చెప్పింది. డైరెక్ట‌ర్ హ‌ర్ష‌కు, దిల్‌రాజుగారికి, శిరీష్‌ గారికి థాంక్స్‌ అని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :