టెలివిజన్ రంగంలో ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి ధారావాహికలతో గుర్తింపు పొందిన సాగర్ కుటుంబం ఇప్పుడు వెండితెరపై ఒక భారీ పౌరాణిక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘శ్రీమద్భాగవతం’ మహాపురాణాన్ని మొత్తం ఏడు భాగాలుగా నిర్మించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో మొదటి భాగానికి ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
దివంగత దర్శకుడు రామానంద్ సాగర్ మనవళ్లు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అమృత్ సాగర్ గతంలో దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘1971’ జాతీయ అవార్డును గెలుచుకుంది. పురాణ కథకు ఆధునిక హంగులు జోడిస్తూ లైవ్-యాక్షన్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ప్రాజెక్ట్ ముహూర్త కార్యక్రమం జరిగింది. అక్కడే భారీ సెట్లు నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ది జంగిల్ బుక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ నిపుణుడు క్లైడ్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మొదటి భాగం ‘విష్ణురథ’ షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాణ వర్గాలు తెలిపాయి.


