నాగ శౌర్య విమర్శలపై స్పందించిన సాయి పల్లవి !
Published on Feb 27, 2018 11:47 am IST

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈమెతో కలిసి ‘కణం’ అనే సినిమా చేసిన హీరో నాగ శౌర్య ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి షూటింగ్స్ కు సమయానికి రాదని, ఆమె వలన తాను చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది.

చాలా రోజులపాటు ఈ విషయంపై స్పందించని సాయి పల్లవి తాజాగా జరిగిన ‘కారు’ ప్రమోషనల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. శౌర్య ఇంటర్వ్యూ చదవగానే తాను కణం చిత్రం దర్శకుడు విజయ్ గారికి ఫోన్ చేసి తన వలన సెట్స్ లో ఎవరైనా ఇబ్బందిపడ్డారా అని అడిగానని దానికి సమాధానంగా ఆయన అలాంటిదేం లేదని జవాబిచ్చారని అన్నారు.

అలాగే సాధారణంగా తాను మనుషుల్ని ప్రేమిస్తానని, తనకు తెలియకుండా తన వలన ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే అది తనకే బాధగా ఉంటుందని, అయినా తాను శౌర్య యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని అన్నారు.

 
Like us on Facebook