ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులపై దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కామెంట్స్..!

ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులపై దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కామెంట్స్..!

Published on May 27, 2026 5:04 PM IST

టాలీవుడ్ ప్రస్తుతం కష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపడం లేదు.. అటు థియేటర్లలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చాలా తగ్గిపోయాయి. అంతేగాక, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పుణ్యమా అని సాధారణ ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే ఆలోచిస్తున్నాడు. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు సంకోచిస్తున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితులపై దర్శకుడు సాయి రాజేష్ తాజాగా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో వస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ టాలీవుడ్‌ ప్రస్తుత ప్రమోషన్ల విధానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో ఒక సినిమా పాట, టీజర్ లేదా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న అసలైన స్పందనను అంచనా వేయడం అత్యంత కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ వ్యూస్, ట్విట్టర్ ట్రెండ్స్ వంటి డిజిటల్ గణాంకాలు విపరీతంగా మానిప్యులేట్ అవుతున్నాయని, దీనివల్ల కంటెంట్ ప్రేక్షకులకు నిజంగా నచ్చిందో లేదో తెలుసుకోవడం సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ విధమైన ఆర్టిఫీషియల్ ప్రమోషన్ల సంస్కృతి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని, దీనివల్ల కొన్ని ప్రత్యేకమైన జోనర్ సినిమాలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని సాయి రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బేబీ’ గురించి మాట్లాడుతూ.. ఒకవేళ ‘బేబీ’ సినిమా గనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో విడుదలై ఉంటే, గతంలో సాధించిన వసూళ్లలో సగం కూడా రాబట్టేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘సమ్మర్ హాలిడేస్’ వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్న ధీరజ్ మొగిలినేనిని ఆయన అభినందించారు. ఇక సాయి రాజేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు