సమంతతో మూడోసారి జత కట్టనున్న మహేష్!

సమంతతో మూడోసారి జత కట్టనున్న మహేష్!

Published on Jun 18, 2015 10:43 AM IST

samantha-mahesh---babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంతల కాంబినేషన్‌లో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలూ సూపర్ హిట్లే! తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ పేరుతో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక పీవీపీ సంస్థ ని్ర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మే 31న లాంచ్ అయింది.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు మహేష్ బాబు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న విషయాన్ని సినిమా యూనిట్ ఇంతకుముందే తెలియజేసినా, ఆ పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే దానిపై స్పష్టతనివ్వలేదు. దీంతో మహేష్ సరసన నటించే హీరోయిన్లు ఎవరెవరంటూ రకరకాల ఊహగానాలు వినిపించాయి.

వాటన్నింటికీ సమాధానమిస్తూ నేడు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించబోయే మెయిన్ హీరోయిన్‌ను ఖరారు చేశారు. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో మహేష్‌తో రెండు సార్లు జతకట్టిన సమంత, బ్రహ్మోత్సవం సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటించనుంది. కాగా ఈ విషయంపై ‘బ్రహ్మోత్సవం’ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

తాజా వార్తలు