
‘ఏ మాయ చేశావే’.. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి సమంత. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సమంత అతి కొద్దికాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేశావే’ సినిమాతోనే ఇప్పటికీ సమంతను ప్రేక్షకులు కనెక్ట్ చేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాను తనకు అందించిన గౌతమ్ మీనన్ తాజా సినిమాలో నటించేందుకు సమంత నో చెప్పాల్సి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళితే.. ‘అచ్చం ఎన్‌బదు మడమైదా’ అనే పేరుతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. 2013లోనే లాంచ్ అయిన ఈ సినిమాను అజిత్ సినిమా కోసం కొంతకాలం పక్కనపెట్టాడు గౌతమ్ మీనన్. అజిత్ సినిమా ‘ఎన్నై అరింధాల్’ (ఎంతవాడు గానీ) విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం గౌతమ్ మీనన్, మళ్ళీ శింబు సినిమాను మొదలుపెట్టాడు.
కాగా గతంలో ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపికైన పల్లవి, సినిమా లేట్ కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి సమంతను సంప్రదించగా, వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పింది. దీంతో మరో హీరోయిన్ కోసం సినిమా యూనిట్ వెతుకుతోంది. ఈ సినిమాను తెలుగులో నాగచైతన్యతో తెరకెక్కించే ఆలోచనలో గౌతమ్ మీనన్ ఉన్నారట. తమిళ వర్షన్ పూర్తయ్యాక తెలుగు వర్షన్ తెరకెక్కనుందని సమాచారం.

