
‘హృదయ కాలేయం’, ‘సింగం 123’.. ఇలా పేరడీ సినిమాలతో తెలుగు సినిమాలో సెన్సేషన్‌గా మారిన స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈ మధ్యే ‘సింగం 123’తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ స్టార్, ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’ అంటూ మరో పేరడీ సినిమాతో మనముందుకు వచ్చేస్తున్నారు. ‘హృదయ కాలేయం’ సినిమాకు పనిచేసిన టీమ్ మళ్ళీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఈ సినిమా చేస్తోంది. దర్శకుడు స్టీవెన్ శంకర్ ఈ సినిమాలో సంపూర్ణేష్ చేత మూడు గెటప్స్ వేయిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత మారుతి గుడ్ సినిమా గ్రూప్‌పై సమర్పిస్తూ ఉండడం విశేషం.
ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పకడ్బందీగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ముహూర్తం కార్యక్రమాలతో వైభవంగా లాంచ్ అయింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణేష్ బాబు క్రేజ్‌తో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన గాయత్రీ గుప్తా, గీతాంజలి, ఇషిక, శ్రీ సుధాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, సంజన మూవీస్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

