కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడంతో భారతీయ సినీ పరిశ్రమ మునుపటి స్థితికి వచ్చే ప్రయత్నాల్లో ఉంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, నటులు, దర్శకులు బయటికొచ్చి చిత్రీకరణలు చేస్తున్నారు. అన్ని పరిశ్రమల సంగతి ఒక ఎత్తైతే బాలీవుడ్ స్నాగతి ఇంకొక ఎత్తు. ముంబై అంతర్జాతీయ ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉండే కావడంతో అక్కడ కోవిడ్ సిట్యుయేషన్ అదుపు కావడం చాలా కష్టమైంది. చివరికి ఎలాగో హిందీ పరిశ్రమ పుంజుకుంటోంది. ఇలాంటి సమయంలోనే మరోసారి కోవిడ్ హిందీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
స్టార్ హీరో రన్బీర్ కపూర్ కరోనా బారిన పడగా తాజాగా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలికి సైతం కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. సంజయ్ లీలా బన్సాలి ‘గంగూబాయ్ కథైవాడి’ సినిమా షూటింగ్లో ఉండగా రన్బీర్ ఆ సెట్స్ కు వెళ్లారు. బన్సాలీని కలిసి ముచ్చటించారు. ఆ వెంటనే ఆయనకు కరోనా అని నిర్ధారణ అయింది. ఆయనకు నిర్ధారణ అయి ఒక్క రోజైనా గడవక ముందే బన్సాలి వైరస్ బారినపడ్డారు. దీంతో ఆ సినిమా యూనిట్ మొత్తం ఆందోళన చెందుతున్నారు. అందరూ వైరస్ నిర్థారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ సంగతి తెలియడంతో ఇతర చిత్ర బృందాల్లో కూడ కంగారు మొదలైంది.


