పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ‘పవర్’ సినిమాతో మెప్పించిన దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో హైలైట్‌గా కనిపిస్తూ వస్తోన్న సినిమా. ‘అత్తారింటికి దారేది’ తర్వాత చాలా కాలానికి పవన్ చేస్తోన్న సినిమా కావడం, సూపర్ హిట్ గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని రూపొందిన కథ కావడం, ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌తో అంచనాలను విపరీతంగా పెంచేయడం వంటి కారణాలు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఇక ఈ మధ్యే హైద్రాబాద్‌లో ఓ చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్, నేడు గుజరాత్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను మొదలుపెట్టింది. నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఈ ఉదయమే పవన్ గుజరాత్ షెడ్యూల్ కోసం అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకోగా, ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేలా దర్శక నిర్మాతలు సినిమాలు సన్నాహాలు చేసుకుంటున్నారు.


