‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్ 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించి, కొత్తవారిని ప్రోత్సహిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాం. తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేసే చక్కని సందేశంతో ఉదయ్ తెరకెక్కించిన ‘పళ్ళ బురుసు’ చిత్రం నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేస్తుంది. పవన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నా తల్లిగారి పుట్టినరోజైన ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.’ అంటూ చెప్పుకొచ్చాడు.

నిర్మాత వివేక్ కృష్ణాణి మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా, ప్రత్యేకంగా భావిస్తున్నాను. దర్శకుడు ఉదయ్ తన గొప్ప విజన్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మాకు నిరంతరం మద్దతుగా నిలిచిన సుప్రియ గారికి, నాగార్జున గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆగస్టు 14న సినిమాను థియేటర్లలో అందరూ చూడండి.’ అని తెలిపారు.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘మొదటిసారి కథ విన్నప్పుడే చాలా స్వీట్‌గా అనిపించింది. వెంటనే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాను. కొత్త కథలను, ప్రతిభను ప్రోత్సహించే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎపిక్ స్టూడియోస్‌తో కలసి చేసిన ఈ సినిమా ఎంతో సంతృప్తిని, గర్వాన్ని ఇచ్చింది. కొత్తవారితో పాటు సీనియర్ నటులు కలిసి నటించిన ఈ చిత్రంలో లోతైన సందేశం ఉంది. తాతయ్య(అక్కినేని నాగేశ్వరరావు) ఉండి ఉంటే ఖచ్చితంగా మెచ్చుకునేవారు.’ అని తెలిపారు.

దర్శకుడు ఉదయ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘నాకు పునర్జన్మనిచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. నాగార్జున గారికి వీరాభిమానైన నాకు ఆయనకు కథ చెప్పే అవకాశం రావడం, కథ వినగానే ఆయన ఒప్పుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. కథ విని ప్రోత్సహించిన సుప్రియ గారికి, నాగచైతన్య గారికి ధన్యవాదాలు. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న సన్నివేశాల ఆధారంగా ‘పళ్ళ బురుసు’ అనే ఒక చిన్న విషయాన్ని పెద్ద కథగా మలచి ఈ సినిమా రూపొందించాను. పవన్ అందించిన సంగీతం, నటీనటుల నటన అద్భుతంగా వచ్చాయి. ఆగస్టు 14న కుటుంబ సమేతంగా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది.’ అని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో నటులు మురళీధర్ గౌడ్, ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, ప్రజ్వల్, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్, లిరిసిస్ట్ సురేష్ గంగుల తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Exit mobile version