సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సాV3’ షూటింగ్ పూర్తయింది. లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం తాజాగా పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ పూజా కార్యక్రమం నిర్వహించినట్లు దర్శకుడు కృష్ణ మాయ తెలిపారు. చిత్రంలోని ప్రధాన పాత్రల (సావిత్రి, విజయ్ కుమార్, త్రివిక్రమ్ రాజు) పేర్ల మొదటి అక్షరాలను కలిపి ‘సాV3’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు.
గ్రామీణ నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు నటుడు సామ్రాట్ పేర్కొన్నారు. ఆన్ సెట్‌లో డైలాగ్స్ అనుకుంటూ సహజంగా నటించినట్లు డీమోన్ పవన్, లిఖిత తెలిపారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, ఎడిటింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.


