
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే! ‘మాస్’ (రాక్షసుడు) సినిమా ప్రమోషన్ల నిమిత్తం సూర్య 24 సినిమాకు కొంత బ్రేక్ ఇచ్చాడు. ఇక గత నెల 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన రాక్షసుడు మంచి టాక్‌తో వెళుతోంది.
రాక్షసుడు సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసిన సూర్య, 24 సెకండ్ షెడ్యూల్‌ను రేపట్నుంచి మొదలుపెట్టనున్నాడు. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

