వెర్సటైల్ యాక్టర్ ఆది సాయికుమార్ హీరోగా నటించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘శంబాల’ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగిస్తోంది. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం, తీవ్ర పోటీలోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో చిత్ర బృందం గురువారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ విజయం పట్ల నటుడు సాయికుమార్ ఉద్వేగంగా మాట్లాడారు.
“ప్రేమ కావాలి, పోలీస్ స్టోరీ రోజుల నాటి హౌస్‌ఫుల్ బోర్డులు మళ్ళీ చూస్తున్నా. ‘మన ఆది హిట్టు కొట్టాడు’ అని అందరూ ఫోన్ చేసి చెబుతుంటే పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నా” అని సాయికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ఇతివృత్తంతో దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, తన వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పడతారని ‘శంబాల’ నిరూపించిందన్నారు. సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా థియేటర్ల సంఖ్య పెంచుతున్నామని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ తెలిపారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన సౌండ్ డిజైన్‌కు థియేటర్లలో విశేష స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ వెల్లడించింది.


