
శర్వానంద్ సినిమాల ఎంపిక గురించీ, అతడి నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో విలక్షణ సినిమాలను, పాత్రలను ఎంచుకుంటూ వెళుతోన్న శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి సినిమాలతో కమర్షియల్‌గా మంచి హిట్స్ అందుకున్నారు. తాజాగా ఆయన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!
వరుస విజయాలతో జోరు మీదున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమా సెట్లో తీసిన ఓ ఫోటోను తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. సినిమా బాగా వస్తోందని, షూటింగ్ చకచకా జరుగుతోందని, అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడు మేర్లపాక గాంధీతో పనిచేయడం చాలా బాగుందని శర్వానంద్ తెలిపారు. ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ కొడతానన్న ధీమాలో శర్వానంద్ ఉన్నారు.

