ముఖ్య అంశాలు
- టీమిండియా టీ20 పగ్గాలను శ్రేయస్ అయ్యర్ చేతికి అప్పగించిన బీసీసీఐ. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు.
- ఆసియా క్రీడలు, ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు జట్లను ప్రకటించిన సెలెక్టర్లు. వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు.
- 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. 36 ఏళ్లుగా పదిలంగా ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును ఇతను బద్దలుకొట్టాడు.
టీమిండియాలో భారీ ప్రక్షాళన మొదలైంది. రాబోయే టీ20 వరల్డ్ కప్, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టి యువ నాయకత్వానికి పెద్దపీట వేశారు. ఈ ఏడాది జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలతో (Asian Games 2026) పాటు, త్వరలో ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత జట్లను సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ జట్ల ఎంపికలో తెలుగోడు తిలక్ వర్మకు భారీ ప్రమోషన్ దక్కింది. నిలకడగా రాణిస్తున్న ఈ యంగ్ బ్యాటర్‌కు ఏకంగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ సెలెక్షన్‌లో అందరి దృష్టీ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మీదే పడింది. కేవలం 15 ఏళ్ల వయసులో సీనియర్ జట్టుకు ఎంపికైన ఈ యంగ్ సెన్సేషన్.. ఏకంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల వయసులో) రికార్డును 36 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2026లో అదరగొట్టిన వైభవ్‌కు ఏకంగా మూడు సిరీస్‌లలోనూ ఆడే అవకాశం వచ్చింది.
జట్లలో మార్పులు, కూర్పు..
ఆసియా క్రీడలకు వెళ్లే జట్టులో సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. కానీ యూకే టూర్ (ఇంగ్లండ్, ఐర్లాండ్)కు మాత్రం అతనికి విశ్రాంతి ఇచ్చారు. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్, ఐపీఎల్‌లో మెరిసిన మరో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌లకు యూకే వెళ్లే జట్టులో అవకాశం దక్కింది. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇరు జట్లలోనూ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లండ్ టూర్ జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
కొత్త కెప్టెన్, కుర్రాళ్లతో నిండిన ఈ యంగ్ టీమిండియా.. వచ్చే సిరీస్‌లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


