
తమిళ హీరో శింబు గురించి తెలుగులోనూ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా చాలా పాత్రల్లో మెప్పించిన ఈ హీరోను తాజాగా ఓ సినిమా తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ వస్తోంది. శింబు హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన ‘వాలు’ అనే సినిమా 2012లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక కారణాలతో మూలన పడింది. ఆ తర్వాత చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూ చివరకు జూలై 17న విడుదలకు సిద్ధమై కోర్టు ఆర్డరుతో మళ్ళీ వాయిదా పడింది.
ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఎలాగోలా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు మ్యాజిక్ రే అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేసిన పిటిషన్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడేళ్ళలో వేరే ఇతర సినిమాలేవీ చేయక, ‘వాలు’ విడుదల కాక, శింబు కెరీర్ దాదాపుగా అస్తవ్యస్తమైంది. ఎట్టకేలకు శింబు తండ్రి రాజేందర్ చొరవతో ఈ సినిమా విడుదలకు సిద్ధమై చివరకు మళ్ళీ ఇలా ఆగిపోవడంతో శింబు పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అయితే తాజా సమాచారం మేరకు ఈ ఇబ్బందులన్నీ సమసిపోయినట్లు తెలుస్తొంది. మ్యాజిక్ రే కేసును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో వాలు సినిమా ఈ నెలాఖర్లో గానీ వచ్చే నెల 7న గానీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

