నేటి నుంచి బన్ని ‘S/O సత్యమూర్తి’ చివరి సాంగ్ షూట్

నేటి నుంచి బన్ని ‘S/O సత్యమూర్తి’ చివరి సాంగ్ షూట్

Published on Mar 11, 2015 10:12 AM IST

So-Sathyamurthy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న సినిమా ‘S/O సత్యమూర్తి’. ‘విలువలే ఆస్తి’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఇటీవల విడుదల చేసిన పాత్రల పరిచయ టీజర్ కి, ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు మోషన్ పోస్టర్ కి అభిమానుల నుంచి, సినీ ప్రేమికుల నుంచి విశేష స్పందన లభించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈ సినిమాలో మిగిలి ఉన్న చివరి సాంగ్ ని ఈ రోజు నుంచి అన్నపూర్ణ 7 ఎకర్స్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు సమంత – ఆద శర్మలు కూడా కలిసి స్టెప్స్ వేస్తున్నారు. ఈ పాటకి జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ తో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు.

మరోవైపు ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా కంటిన్యూగా తన పార్ట్ కి డబ్బింగ్ చెబుతున్నారు. ఈ నెల 15న ఈ సినిమా అడియోని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 2న సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు