‘రంగస్థలం’కు కలిసిరానున్న సోలో రిలీజ్ !

ఈ వారం భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న చిత్రం రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’. దాదాపు ఏడాది పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్, అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని కూడ అంటున్నారు. మంచి బడ్జెట్ తో రూపొంది, భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా ఓపెనింగ్స్ పైనే అందరి దృష్టి ఉంది.

ఈ వారం ఈ సినిమా మినహా వేరే పెద్ద, చిన్న సినిమాలేవీ లేకపోవడంతో దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శింపబడనుంది. ఈ సోలో రిలీజ్ వలన ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. సినిమా బాగుంటే లాంగ్ రన్లో చిత్రం చరణ్ కెరీర్లోనే ఉత్తమమైన వసూళ్లను నమోదు చేసే అవకాశాలున్నాయి. ఓవర్సీస్లో కూడ ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ నెలకొని ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.