ఇప్పటి వరకూ అగ్ర హీరోలు నటించే సినిమాలలో ప్రణయ గీతమైనా, శృంగార సరస సల్లాపాలు సాగించే మసాలా గీతమైనా ఐరోపా వెళ్ళాల్సిందే. కేవలం ఈ ధోరణి పాటలకు మాత్రమే పరిమితం కాలేదు. సబ్జెక్టు డిమాండ్ మేరకు కొన్ని సన్నివేశాలను సైతం ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. కొందరు దర్శకులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి విదేశి నేపధ్యంలో కథలను రాసుకున్నారు. అవి ఘన విజయాలు కూడా సాధించాయి. ప్రస్తుత తరుణంలో ఫారిన్ లొకేషన్లలో తెలుగు సినిమా అంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే, లో బడ్జెట్ సినిమాలు కూడా బ్యాంకాక్, థాయిలాండ్, స్పెయిన్, ఐరోపా కంట్రీస్ వెళ్లి వచ్చేస్తున్నాయి. ఫారిన్ అనే పదం పాతదైపోయింది. ఇటువంటి సమయంలో దర్శకుడు శంకర్ ప్రత్యామ్నాయం చూపారు.
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ సినిమాలో కొంత భాగాన్ని చైనాలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. చైనాలో చిత్రీకరించిన ఒక పాటను ఇటీవలే విడుదల చేశారు. ఆ పాటలో లొకేషన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. భారతీయ ప్రేక్షకులకు ఇప్పటివరకు వీటిని తెరపై చూడలేదు. దాంతో కొత్త అబుభూతికి లోనయ్యారు. ఇది గమనించిన సౌత్ ఇండియన్ దర్శక నిర్మాతల కన్ను చైనాపై పడింది. చైనా నేపధ్యంలో సినిమా తీస్తే బాగుంటుందని భావిస్తున్నారట. యాక్షన్ సన్నివేశాలను కూడా కొత్తగా తెరకెక్కించడానికి ఆస్కారం ఉంటుంది. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ను పూర్తి స్థాయిలో సౌత్ ఇండియన్ తెరపై ఎవరూ ఆవిష్కరించలేదు. ఈ అంశం కూడా దర్శకనిర్మాతలు చైనాకు ప్రాముఖ్యత ఇవ్వడానికి ఓ కారణం.


