రమణారెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఆగస్ట్ 21న థియేటర్లలోకి తీసుకువస్తోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రధారులు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
95 శాతం సింక్ సౌండ్‌తో చిత్రీకరణ
హైదరాబాద్ బస్తీ జీవన విధానం, అక్కడి స్థానిక సంస్కృతి నేపథ్యంలో బిర్యానీ ప్రధాన అంశంగా ఈ కథ సాగుతుందని నటులు తెలిపారు. సహజత్వాన్ని ప్రతిబింబించేందుకు దాదాపు 95 శాతం సినిమాను సింక్ సౌండ్‌తోనే చిత్రీకరించినట్లు వెల్లడించారు. తాము ముగ్గురం ప్రధానంగా కనిపించినప్పటికీ కథను ముందుకు నడిపించేది మాత్రం మహిళా పాత్రలేనని, ఇందులోని భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తాయని స్పష్టం చేశారు.
ఈ చిత్రంలో వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. స్మరణ్ సంగీతం అందించిన ఈ సినిమా, హైదరాబాద్ బస్తీ యాస మరియు జీవనశైలిని వాస్తవిక దృక్కోణంలో తెరపై ఆవిష్కరిస్తుందని నటులు పేర్కొన్నారు.
