ఇంటర్వ్యూ : శ్రీకాంత్ అడ్డాల – ‘నారప్ప’ పూర్తి కుటుంబ కథా చిత్రమే, కానీ.. !

Published on Jul 19, 2021 2:02 pm IST

విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా ‘నారప్ప’ ఈ నెల 20వ తేదీ అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం.

 

‘నారప్ప’లో మీ మాస్ యాంగిల్‌ తో అందర్నీ ఆశ్చర్యపరిచారు ?

అవును, నేను కూడా యాక్షన్ ఫిల్మ్ చేయగలనని ఈ చిత్రం రుజువు చేస్తుంది. అయితే, జోనర్ ఏదైనా చెప్పాలనుకున్న భావోద్వేగమే ముఖ్యమని నేను భావిస్తాను. ఇక ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన స్పందనకి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. అంత బాగా నారప్ప ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చింది.

 

‘అసురన్’ను నారప్పగా మార్చడానికి స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేసారు?

కొన్ని క్లాసిక్స్ ను మార్చకూడదు అండి. అందుకే, ‘అసురన్’లో నేను కూడా ఏమి మార్చలేదు. కాకపోతే తెలుగు నేటివిటీ మార్పులు కొన్ని చేశాను తప్ప, ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఎక్కువగా ఏ మార్పు చేయలేదు. అందుకే నమ్మకంగా చెబుతున్నాను, ఒరిజినల్ భావోద్వేగాలు చెక్కుచెదరకుండా ఉంటాయి ఈ సినిమాలో.

 

మీకు ఈ రీమేక్ ఆఫర్‌ ఎలా వచ్చింది ?

వెంకటేష్ గారు హీరోగా సురేష్ బాబు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుసు. వాళ్ళు కథ మరియు రీమేక్ చర్చలలో బిజీగా ఉన్న సమయంలో నేను సురేష్ బాబుగారికి ఒక కథ చెప్పాను. నా కథ చర్చల సమయంలో వారు నారప్ప కోసం దర్శకుడిని వెతుకుతున్నారని తెలిసింది. నేను నేరుగా సురేష్ బాబును సంప్రదించాను. ఆయన వెంకటేష్, ఆలాగే ఇతర నిర్మాతలతో చర్చించి నన్ను దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.

 

మీరు చేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామాలే. మరి ఈ యాక్షన్ డ్రామా చేయడం కష్టమైందా ?

నారప్ప పూర్తి పూర్తి కుటుంబ కథా చిత్రం అండి. కాకపోతే చిన్న తేడా ఏమిటంటే చాలా యాక్షన్ కూడా ఉంటుంది. కానీ ఆ యాక్షన్ అంతా ఫ్యామిలీ డ్రామా చుట్టూ జరుగుతుంది కాబట్టి, నాకు పెద్ద కష్టం ఏమి అనిపించలేదు. అయితే ఈ చిత్రాన్ని బాగా తీయాలని నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చేశాను.

 

నారప్ప ఓటీటీ రిలీజ్ పై మీరు నిరాశ చెందారా ?

కచ్చితంగా. డిజిటల్ రిలీజ్ అవుతుందనే సరికి పూర్తిగా బాధ పడ్డాను. ఈ చిత్రం ఓటీటీకి వెళ్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నిర్మాతలు ఒక రోజు, ఓటీటీలో మన సినిమా రిలీజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ వచ్చాక, రెండు రోజులు నేను కూడా నిద్రపోలేదు. ఎందుకంటే నేను నారప్పను ఒక భారీ చిత్రంలాగా చేశాను, కానీ ఇప్పడున్న పరిస్థితుల దృష్ట్యా వేరే మార్గం లేకుండా పోయింది. వెంకటేష్ గారు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.

 

ఈ చిత్రంలో వెంకటేష్ పాత్ర మరియు ఆయన నటన గురించి చెప్పండి?

ఈ చిత్రం కోసం వెంకీ సార్ తనను తానూ పూర్తిగా మార్చుకున్నారు. మాకు 60 రోజుల ఒకే షెడ్యూల్ ఉంది. ఆయన తన పూర్తి అంకితభావంతో పూర్తి షెడ్యూల్ లో మాకు బాగా సపోర్ట్ చేస్తూ షూట్ లో పాల్గొన్నారు.

 

మీ రాబోయే ప్రాజెక్టులు ఏమిటి?

గీతా ఆర్ట్స్ లో నేను ఒక సినిమా చేయబోతున్నాను. ఆ చిత్రం 70 మరియు 80ల కాలంలో సాగుతుంది. ప్రస్తుతానికి ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ లో నేను బిజీగా ఉన్నాను, త్వరలో ఆ సినిమా తుది ప్రకటన వస్తుంది అంటూ శ్రీకాంత్ అడ్డాల ముచ్చట్లు ముగించారు.

సంబంధిత సమాచారం :