
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ డైలాగ్స్, కొరటాల శివ మార్క్ సన్నివేశాలు టీజర్లో స్పష్టంగా కనిపించడంతో మహేష్ మళ్ళీ తన మ్యాజిక్ సినిమాతో రానున్నాడనే టాక్ వినబడుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను ఈనెల 27న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న ఆడియో రిలీజ్‌కు ఇంకా పదిరోజులు ఉండగా, అప్పుడే శ్రీమంతుడు ఆడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. వాట్సాప్ లాంటి ఇన్స్టెంట్ మెసేజింగ్ ద్వారా ఈ సినిమా పాటలు అప్పుడే కొన్ని చోట్ల సర్కులేట్ అవుతున్నట్టు సమాచారం. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్లలో కొంతమంది ఆడియో విన్నామంటూ, ఆడియోపై తమ అభిప్రాయాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈమధ్యే బాహుబలి ఆడియో రిలీజ్‌కి మూడు రోజుల ముందే లీకైన విషయం తెలిసిందే! ఇప్పుడు శ్రీమంతుడు ఆడియో కూడా లీకైందనే ప్రచారం శోచనీయం. ఈ లీక్ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.