
సగటు తెలుగు సినీ అభిమాని దృష్టిని గత కొద్దికాలంగా పూర్తిగా తనవైపు మళ్ళించుకున్న క్రేజీ సినిమా ‘కంచె’. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు క్రిష్ చేసిన తాజా ప్రయత్నం కంచె ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ రూపొందించిన ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఈ అంశంతో వస్తోన్న మొట్టమొదటి సినిమాగా ప్రత్యేకత సంపాదించింది.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రేపు (అక్టోబర్ 22న) పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక సినిమాగా రూపొందిన కంచెపై ఇటు ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా మంచి విజయం సాధించాలని పలువురు స్టార్ హీరోలు సినిమా యూనిట్‌కు విషెస్ తెలిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా తదితరులు కంచె సినిమాకు, డైరెక్టర్ క్రిష్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

