మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించారు, కానీ, ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వినిపించిన రూమర్ ప్రకారం, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే, దర్శకుడు వశిష్ట స్పందిస్తూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ఆ వార్తలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఓహో, నిజమేనా ?” అని బదులివ్వడం ద్వారా ఆయన ఆ పుకార్లకు ముగింపు పలికారు. కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


