టాలీవుడ్ లో స్టార్ హీరోలు చేస్తున్న కమర్షియల్ సినిమాల ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ మొత్తం ఓ సోషల్ మెసేజ్ చుట్టూ తిరుగుతుంది. మన మూలాలని మరచిపోకూడదు, మనం పుట్టిన ఊరిని గుర్తు పెట్టుకొని, దాని అభివృద్దిలో మనమూ భాగస్వాములం కావాలనే పాయింట్ ని ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. గత పది రోజులుగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలో సుమారు 60 కోట్ల మార్క్ ని టచ్ అయిన ఈ సినిమా సెకండ్ వీక్ లోనూ అదే జోరుని కొనసాగిస్తోంది.
సెకండ్ వీకెండ్ లో కూడా శ్రీమంతుడు సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ నమోదయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెకండ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా కలుపుకొని సుమారు 10 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ వీకెండ్ లో కూడా మహేష్ బాబు అండ్ టీం చాలా బాగా సినిమాని ప్రమోట్ చెయ్యడం కూడా సినిమాని బాగా హెల్ప్ అయ్యింది. కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ ఇంత కమర్షియల్ గా డీల్ చేయడంతో అతనికి ఎక్కువగా ప్రశంశలు దక్కాయి. మహేష్ బాబు సరసన మొదటిసారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీమంతుడు సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్నారు.


