అతనడిగిన మాటకు సిగ్గనిపించి ‘రంగస్థలం’ చేశాను : సుకుమార్

తీసే సినిమాల్లో సృజనాత్మకతను ఎక్కువ చూపించే దర్శకుడు సుకుమార్. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ చిత్రానికి కూడ 80ల కాలంలో జరిగే కథ అనే ప్రత్యేక ఉంది. ఇన్నాళ్లు స్టైలిష్ సినిమాలు తీస్తూ వచ్చిన సుకుమార్ ఒక్కసారిగా ఇలాంటి భిన్నమైన సినిమా తీయడంతో అందరిలోనూ దీని వెనుక ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అనే ఆలోచన మొదలైంది.

ఇదే ప్రశ్నను ప్రెస్ మీట్లో సుకుమార్ వద్ద ప్రస్తావించగా ఆయన సమాధానమిస్తూ ‘నేను 28 ఏళ్ల వరకు పల్లెటూరిలోనే ఉన్నాను. సినిమాల్లోకి వచ్చాక విదేశాలంటూ తిరిగుతున్నాను. నా గత సినిమాలు వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో ఎక్కువగా విదేశాల్లోనే షూట్ చేశాం. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి సర్ మీరు సినిమాలు చాలా బాగా తీస్తున్నారు. కానీ మన తెలుగు నైపథ్యంలో ఎందుకు తీయడంలేదు అనడిగారు.

ఆ మాటకు నాకు సిగ్గనిపించింది. దానికి సమాధానంగానే ‘రంగస్థలం’ చేశాను. ప్రతి పల్లెటూరు నాటక రంగంలానే ఉంటుంది. అక్కడ రకరకాల మనుషులు, పాత్రలు ఉంటాయి. అందుకే అన్ని పల్లెటూళ్లను కలిపేలా రంగస్థలం అని పేరు పెట్టాం అన్నారు. ఇక నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మార్చి 30న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అన్నారు.