సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్

సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్

Published on Apr 24, 2026 9:10 PM IST

Michael

విడుదల తేదీ : ఏప్రిల్ 24, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : జాఫర్ జాక్సన్, కోల్మన్ డొమింగో, మైల్స్ టెల్లర్, కీలిన్ డారెల్ జోన్స్ తదితరులు
దర్శకుడు : ఆంటోనీ ఫుక్వా
నిర్మాతలు : గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్‌క్లైన్
సంగీతం : లయొర్ రోస్నర్
సినిమాటోగ్రఫీ : డియోన్ బీబీ
ఎడిటర్స్ : కాన్రాడ్ బఫ్, టామ్ క్రాస్, జాన్ ఓట్‌మాన్, హ్యారీ యూన్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

పాప్ ప్రపంచానికి రారాజు మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’. జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఈ సినిమా ఇండియానాలోని గ్యారీలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మైఖేల్ జాక్సన్ (జాఫర్ జాక్సన్) ప్రయాణాన్ని చూపిస్తుంది. తన తల్లి ప్రోత్సాహంతో, సోదరులతో కలిసి ‘జాక్సన్ 5’ బ్యాండ్‌లో మైఖేల్ తన ప్రతిభను చాటుకుంటాడు. అయితే, తన తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) కఠినమైన ప్రవర్తన మైఖేల్‌ను మానసిక వేదనకు గురిచేస్తుంది. ఆ భయం నీడలోనే సోలో కెరీర్‌ను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు? తన బాల్యాన్ని వెతుక్కుంటూ అతను నిర్మించుకున్న ‘నెవర్ ల్యాండ్’ వెనుక ఉన్న ఎమోషన్ ఏమిటి? అనేదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో మైఖేల్ జాక్సన్ పాటలు లేదా డ్యాన్స్ ప్రభావం ఉండే ఉంటుంది. తన అద్భుతమైన గొంతుతో, అదిరిపోయే స్టెప్పులతో ప్రపంచాన్ని ఊపేసిన ఈ లెజెండ్ బయోపిక్ అనగానే అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా తన రియల్ లైఫ్ కన్సర్ట్స్ మరియు పాపులర్ సాంగ్స్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా ఐకానిక్ ‘థ్రిల్లర్’ ట్రాక్ రీక్రియేషన్ ప్రేక్షకులకు అమితమైన సంతృప్తిని ఇస్తుంది. ఈ సీన్స్ చూస్తున్నంత సేపు మళ్ళీ మనం పాత జాక్సన్ వీడియోలను చూస్తున్నామా అన్నంతగా మంత్రముగ్ధులను చేస్తాయి.

మైఖేల్ జాక్సన్ బాల్యం తన తండ్రి వల్ల ఎంత ఇబ్బందికరంగా సాగిందో ఇందులో ఎమోషనల్‌గా చూపించారు. తండ్రి నుంచి ఎదుర్కొన్న శారీరక, మానసిక వేధింపుల కారణంగా, మైఖేల్ తను పోగొట్టుకున్న బాల్యాన్ని వెతుక్కుంటూ ‘నెవర్ ల్యాండ్’ అనే ఒక కలల ప్రపంచాన్ని ఎలా సృష్టించుకున్నాడో చూపించిన విధానం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. ఒక కన్సర్ట్ సమయంలో తన తండ్రికి తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.

జాఫర్ జాక్సన్ డెబ్యూ మూవీతోనే అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైఖేల్ జాక్సన్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ మరియు డ్యాన్స్ మూవ్స్‌ను ఆయన అచ్చుగుద్దినట్లు దించేశారు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా జాఫర్ నటన అదిరిపోయింది. తండ్రి పాత్రలో కోల్మన్ డొమింగో విలనీని అద్భుతంగా పండించి ప్రేక్షకుల్లో ద్వేషం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. యంగ్ మైఖేల్‌గా నటించిన జూలియానో క్రూ వాల్డి చాలా క్యూట్‌గా కనిపిస్తూనే మెప్పించాడు. మైల్స్ టెల్లర్ మరియు ఇతరులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

మైనస్ పాయింట్స్:

సాధారణంగా ఏ బయోపిక్ చూసే ప్రేక్షకులైనా ఆ సెలబ్రిటీ జీవితంలోని అన్ని కోణాలను, ముఖ్యంగా వారి ఎదుర్కొన్న వివాదాలను కూడా చూడాలని ఆశిస్తారు. ఈ విషయంలోనే ‘మైఖేల్’ సినిమా కొంత నిరాశపరుస్తుంది. మైఖేల్ జాక్సన్ జీవితం చుట్టూ ఉన్న ఆరోపణలు, సంచలన వివాదాలను సినిమాలో పెద్దగా టచ్ చేయలేదు. దీనికి రెండో భాగం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత కథ మాత్రం సగం మాత్రమే చెప్పినట్లుగా అనిపిస్తుంది.

సినిమా ప్రారంభంలో కథనం కొంత నెమ్మదిగా సాగడం కూడా మైనస్. అలాగే కొన్ని కీలక అంశాల మీద స్పష్టత లోపించింది. మైఖేల్ సోలో కెరీర్‌లో బిజీగా ఉన్నప్పుడు అతని సోదరులు ఏం చేస్తున్నారు? తమ్ముడి ఎదుగుదల చూసి వారు అసూయ పడ్డారా లేదా వారి ఆల్బమ్స్ పరిస్థితి ఏమిటి? అనే విషయాలను దర్శకుడు విస్మరించాడు. ఆరోపణల సంగతి పక్కన పెట్టినా, కనీసం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఈ సంబంధాలను లోతుగా చూపించి ఉంటే బాగుండేది. ఇవన్నీ అడ్రెస్ చేయకపోవడం వల్ల సబ్జెక్ట్ పరంగా సినిమాలో కొంత వెలితి కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు ప్రధాన బలం మైఖేల్ జాక్సన్ యొక్క ఐకానిక్ సాంగ్స్. ఆ పాటలను వాడుకున్న విధానం సినిమా స్థాయిని పెంచింది. బార్బరా లింగ్ ప్రొడక్షన్ డిజైన్ మరియు మార్సీ రోడ్జర్స్ కాస్ట్యూమ్స్ 80-90 కాలపు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు రీక్రియేట్ చేశాయి. డియోన్ బీబీ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కన్సర్ట్ సీక్వెన్స్‌లు ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉన్నాయి. ‘థ్రిల్లర్’ ట్రాక్ చిత్రీకరణ మ్యాజికల్‌గా అనిపిస్తుంది. దర్శకుడు ఆంటోనీ ఫుక్వా తన పనితనంతో కొన్ని చోట్ల మెప్పించాడు. ముఖ్యంగా ఒక మ్యూజిక్ ఐకాన్‌ను వెండితెరపై సెలబ్రేట్ చేయడంలో ఆయన విజయం సాధించాడు. అయితే, మైఖేల్ జీవితంలోని కొన్ని కీలక అంశాలను లోతుగా టచ్ చేసి ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత బలంగా ఉండేది. ఆ విషయంలో దర్శకుడు కొంత తడబడ్డాడు అనిపిస్తుంది.

తీర్పు:

ఓవరాల్‌గా చూస్తే.. ‘మైఖేల్’ సినిమా పాప్ లెజెండ్‌కు ఒక గొప్ప నివాళి. జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్ మరియు అద్భుతమైన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. అయితే, మైఖేల్ జీవితంలోని వివాదాలను చూపకపోవడం మైనస్. మైఖేల్ జాక్సన్ అభిమానులు, ఆయన జీవితం గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ ‘మైఖేల్’ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు