స్టార్ హీరో సినిమాలకు కొబ్బరికాయ కొట్టినరోజు నుండే క్రేజ్ ఏర్పడుతుంది. చిన్న హీరోల సినిమాలంటే అటు బిజినెస్ వర్గాలలోను ఇటు ప్రేక్షకులలోనూ చిన్న చూపే. అవడానికి చిన్న సినిమా అయినా స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో పబ్లిసిటీ కొట్ట్టేసింది ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది..? అనే కాన్సెప్ట్’తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ బాబు మాస్క్ వేసుకుని ముగ్గురు వ్యక్తులు నిలబడిన ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్, డిజిటల్ మోషన్ పోస్టర్ విడుదల చేయగానే సినిమా ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి పెరిగింది. సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియో విడుదలకు రెడీ అయ్యింది. ఈ ఆదివారం జూలై 13న ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ ఆడియో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు.
నందు, భూపాల్, పూనం కౌర్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ద్వారా సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మిస్తున్నారు. కొన్ని ఊహించని సంఘటనల వల్ల ప్రమాదంలో ఇరుకున్న ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా.? లేదా.? అనేది సినిమా కథ అని దర్శకుడు తెలిపారు.


