కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి తెచ్చిన ఏ కథకైనా నేను ఓకే చెప్పేవాడినని, ఆయనతో పనిచేయాలని తాను మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.
అయితే, అంతకంటే ముందే వెంకీ ఒక బయోపిక్ స్క్రిప్ట్‌తో తనను సంప్రదించారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని వెల్లడించారు. సూర్య చేసిన ఈ వ్యాఖ్యలతో వెంకీ అట్లూరి ఏ మహనీయుడి జీవిత కథను సూర్యతో తీయాలనుకున్నారనే ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది.
తన గత రెండు చిత్రాలు పిరియాడిక్ నేపథ్యంలోనే సాగడంతో, ఈ బయోపిక్ కూడా అదే కోవలోకి వచ్చి రొటీన్‌గా మారుతుందని వెంకీ భావించి దాన్ని పక్కన పెట్టారట. దీనికి తోడు సూర్య కూడా ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఆశించడంతో వీరి కాంబినేషన్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూపుదిద్దుకుంది.
