
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమిళంలో అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో తెలుగులోనూ అదే స్థాయి క్రేజ్ ఉంది. ఇక తెలుగు వర్షన్ హక్కులను హీరో నితిన్ సొంతం చేసుకున్న తర్వాత తెలుగులోనూ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ రెట్టింపైంది.
’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ’24’ సినిమాతో ఓ సైన్స్ ఫిక్షన్ కథ ద్వారా అందరినీ ఆశ్చర్యపరచేందుకు సిద్ధం కానున్నారట. ఇప్పటివరకూ డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరిగినా, తాజాగా ఈ సినిమా పొంగల్ బరిలో నిలవనుందని తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

