సినీ ఇండస్ట్రీలో ఒక ఫార్మాట్ లో సినిమా హిట్ అయ్యింది అంటే, ఇక అదే ఫార్మాట్ లో పలు సినిమాలు వస్తుంటాయి. అలా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్న జానర్ హర్రర్ కామెడీ. గత ఏడాది అంజలి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్ అయ్యింది. దాంతో గీతాంజలి టీం ఆ సినిమాకి సీక్వెల్ గా ‘త్రిపుర’ సినిమా చేస్తోంది. తన క్యూట్ లుక్స్ మరియు హస్కీ వాయిస్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన స్వాతి ఈ మూవీ టైటిల్ రోల్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం హైదరాబాద్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.
రేపటితో ఈ చిత్ర క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తవుతుంది. దాంతో త్రిపుర టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత రెండు పాటల చిత్రీకరణ కోసం కొడైకెనాల్, పొల్లాచ్చి వెళ్లనున్నారు. జూలై లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడమే కాకుండా జూలై చివరి వారంలో రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. గీతాంజలి సినిమాలానే ఈ సినిమాకి కథ- మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా ప్రముఖ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో కథని మలుపు తిప్పే ఓ కీ రోల్ లో యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. చినబాబు – రాజశేఖర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కూడా గీతాంజలికి దర్శకుడైన రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.


