సైరా టీజర్: చరిత్ర ఎరుగని వీరుని గాథ…!

Published on Aug 20, 2019 3:27 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తుడంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రాయలసీమకు చెందిన మొదటితరం స్వతంత్రయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. కాగా నేడు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

టీజర్ పవన్ కళ్యాణ్ చెప్పిన.. “చరిత్ర స్మరించుకుంటుంది…,చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని…, కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు, ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యడు” అనే వాయిస్ ఓవర్ డైలాగ్ తో మొదలైంది. దాదాపు ఒకటిన్నర నిమిషానికి పైగా నిడివి గల సైరా టీజర్ అద్భుతంగా సాగింది. చరిత్ర గతిన పడిపోయిన ఓ విప్లవ వీరుని గాధ సైరా చిత్రం కొంచెం కాల్పనికత జోడించి తీశారని తెలుస్తుంది.

సైరా నరసింహారెడ్డి గా చిరంజీవి చక్కగా సరిపోయారు. “చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి” అని గంభీర స్వరంతో ఆవేశంగా ఆయన చెప్పిన డైలాగ్ రోమాంచితంగా ఉంది. వీరోచిత పటిమతో అలుపెరని పోరాటం సాగించిన వీరుడిగా ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక టీజర్లో మిగతా ముఖ్య నటులైన జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా అలనాటి వీరుల వేషధారణలో పాత్రలకు తగ్గట్టు చాలా గ్రాండ్ గా ఉన్నారు. సైరా కు దిశానిర్ధేశం చేశే గురువుగా అమితాబ్ లుక్ ఆకట్టుకుంది. మొత్తంగా గ్రాండ్ విజువల్స్, ఉపిరిసలపని పోరాటాలతో పాటు, ఆకట్టుకొనే బీజీఎమ్ తో రూపొందిన సైరా టీజర్ అంచనాలకు మించి ఉంది అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ టీజర్ కి మరో ఆకర్షణగా నిలిచింది .

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :