
గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతున్న తాప్సీ, ఆ పాత్రలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఈ కోవలో ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘కాంచన 2’ తర్వాత తాప్సీ పేరు తెలుగు, తమిళ భాషల్లో మారుమోగిపోయింది. ప్రస్తుతం తాప్సీ, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కొంత గ్యాప్ తీసుకొని తెరకెక్కుస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే!
తాజాగా తాప్సీ మరో క్రేజీ అవకాశాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. కన్నడలో ‘మైనా’ పేరుతో సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించే కొత్త సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం ఇలా నాలుగు భాషల్లో విడుదలయ్యే సందర్భంలోనే ఈ సినిమాలో నటించేందుకు తాప్సీ ఓకే చెప్పిందట. దర్శకుడు కూడా ఈ కండీషన్‌కు ఓకే చెప్పడంతో నాలుగు భాషల్లో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్టులో తాప్సీ భాగం కానుంది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

