
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం యావత్ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, మళయాల,హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇప్పట్నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయ్! ఇప్పటికే ముంబైలోని ఓ ఈవెంట్‌లో హిందీ,తెలుగు ట్రైలర్‌లను లాంచ్ చేయగా, చెన్నైలో నిర్వహించిన మరో ఈవెంట్‌లో ‘బాహుబలి’ తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ‘బాహుబలి’ సినిమాకు తమిళ, హిందీ పరిశ్రమ అందగా నిలబడడం విశేషంగా కనిపిస్తోంది. సాధారణంగా హిందీ, తమిళ మార్కెట్‌లలో ఇతర భాషల సినిమాలు తమ ఉనికిని చాటుకోవడం చాలా కష్టం. అయితే బాహుబలి విషయంలో హిందీలో కరణ్ జోహర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, మీడియా బాహుబలికి విశేష ప్రచారాన్ని కపిస్తున్నాయి. అదే విధంగా తమిళంలో కూడా ఈ సినిమాను తమ సినిమాగా స్టార్ హీరోలు ప్రమోట్ చేసుకుంటున్నారు. తమిళంలో పెద్ద సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఆ సంస్థకు మిత్రుడైన సూర్య కూడా తన రేంజ్‌లో బాహుబలికి ప్రచారం కల్పిస్తున్నారు. తమిళ పరిశ్రమ నుంచి బాహుబలికి మంచి అండ లభిస్తోంది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమాగా బాహుబలికి అన్ని చోట్లా ప్రచారం లభించడం విశేషం.!
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే! కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ నెల్లోనే విడుదల కానుంది.

