తమిళ స్టార్ హీరో విజయ్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన తమిళ సినిమా ‘జిల్లా’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమా గత సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 9న విడుదలై తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ చేయనున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగినా, చివరకు ఈ సినిమాను అదే పేరుతో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితిలు తెలుగులో డబ్ చేశారు.
నేసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విడుదలై దాదాపు 18 నెలల తర్వాత తెలుగులో విడుదలైన ఈ సినిమా మొదటి వారం మంచి కలెక్షన్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా మూడో రోజునుంచే డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించిందని తెలుస్తోంది. ఇక గతంలో హీరో విజయ్ మురుగదాస్, శంకర్‌ల పేరుతో ‘తుపాకి’, ‘స్నేహితుడు’ లాంటి సినిమాలతో మెప్పించినా, ఆ సినిమాలు హిట్ అనిపించుకునే స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. తాజాగా ‘జిల్లా’ హిట్ స్థాయిని సొంతం చేసుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. జిల్లా విజయం తర్వాత త్వరలో విజయ్ హీరోగా రానున్న ‘పులి’కి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని ఇండస్ట్రీ భావిస్తోంది.


