
‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా కాగా, మరొకటి రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్. మొదట ‘బాహుబలి’ మే నెలలో విడుదల కానుందన్న ప్రకటనతో, మహేష్ ‘శ్రీమంతుడు’ జూలై 17కు ఫిక్స్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా ‘బాహుబలి’ కూడా జూలైకి మారిపోవడంతో ఈ రెండు సినిమాలూ పోటీ పడే పరిస్థితి తలెత్తింది.
ఈ నేపథ్యంలో రెండు పెద్ద సినిమాలు వారం తేడాలో విడుదల కావడం రెండు సినిమాలకూ మంచిది కాదనే అభిప్రాయంలో ‘శ్రీమంతుడు’ నిర్మాతలు సినిమాను వాయిదా వేశారు. జూలై 17న ఫిక్స్ చేసిన తేదీని తాజాగా ఆగష్టు 7కు మార్చారు. ఇక తమ కోరికను మన్నించి ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసినందుకు దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబులకు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ థ్యాంక్స్ తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇలా రెండు పెద్ద సినిమాల నిర్మాతలు ఒక అవగాహనకు వచ్చి రెండు సినిమాలకూ సరైన విడుదల తేదీలను నిర్ణయించుకోవడం ఆహ్వనించదగ్గ విషయమే! ఇక ప్రస్తుతానికి ‘బాహుబలి’ జూలై 10కి, ‘శ్రీమంతుడు’ ఆగష్టు 7కు ఫిక్స్ అయ్యాయి. రెండు పెద్ద సినిమాలతో జూలై, ఆగష్టు నెలలు తెలుగు సినిమా ప్రేక్షకుడికి పండగే!

