తెలుగు జాతి విశిష్టతను తెలియజేసేలా ప్రముఖ దర్శకుడు తేజ ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు. ఈ డాక్యుమెంటరీకి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. సోమవారం నిర్మాత పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలలో ఈ విషయాన్నీ తేజ వెల్లడించారు.
తేజ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు జాతి ఔనత్యాన్ని ఖండాంతరాలు వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయులు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రతిష్టను అవహేళన చేసే రీతిలో తమిళంలో ఓ సినిమా రూపొందింది. హాస్య నటుడు వడివేలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ తమిళనాడులో ధర్నాలు నిర్వహించి, తెలుగువారి గొప్పతనాన్ని చాటిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తుండడం గర్వించదగ్గ విషయం. అని దర్శకుడు తేజ తెలిపారు.


