తెలంగాణ రాష్ట్ర AVCGI (Animation, Visual Effects, Comic and Gaming) అసోసియేషన్ ఈ మధ్యే ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్ సర్వీస్‌లో పాల్గొంది. భారత పరిశ్రమల సంఘం (సీఐఐ) నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌లో తెలంగాణ AVCGI ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అంతర్జాతీయ సంస్థల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా తమకు ఈ సదవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ AVCGI సంఘం అధ్యక్షులు, డిజిక్వెస్ట్ అధినేత బాసిరెడ్డి పాల్గొని తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఓ గొప్ప సదస్సులో తమకు మంచి ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తమకు అన్నివిధాలా అండగా నిలిచి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా యానిమేషన్ రంగానికి ప్రభుత్వం మరిన్ని రాయితీలు కల్పించాలని కోరారు. యానిమేషన్ రంగంలో ఉపాధికి కరువే లేదని, యువత ఈ రంగంలో నైపుణ్యం సాధించి మంచి కెరీర్ దిశగా అడుగులేయాలని అన్నారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న యానిమేషన్ రంగ నిపుణులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వెలిబుచ్చుతూ భవిష్యత్ యానిమేషన్ రంగానిదేనని, యువత తమ కెరీర్‌ను ఈ దిశగా ప్లాన్ చేసుకుంటే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని తెలిపారు. ఈ విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికీ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.


