ఎప్పుడూ సరికొత్త కథలతో, విభిన్న గెటప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే మాస్ సినిమా విడుదలకు సిద్ధమౌతుండగా, ఇప్పటికే తన తరువాతి ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు సూర్య . ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ సూర్యతో ’24’ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ముంబైలో ఏప్రిల్ 8న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ కీలక పాత్రకు ఎంపికైన ప్రముఖ తెలుగు నటుడు అజయ్ కూడా జాయినయ్యారు. అజయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు. గతంలో ‘ఇష్క్’ సినిమాలో హీరోకు ఆపోజిట్‌గా ఓ బలమైన పాత్ర ద్వారా అజయ్‌ని కొత్తగా ప్రెజెంట్ చేసిన విక్రమ్, ఈ సినిమాలోనూ మరో కొత్త తరహా పాత్రను డిజైన్ చేశారని తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మింస్తుండడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు సూర్య. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.


