అమెరికాలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి, మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడిన ఓ తెలుగు యువతి.. అతి చిన్న వయసులోనే క్యాన్సర్ మహమ్మారికి బలైంది. అమెరికాలోని కాన్సస్ సిటీలో పనిచేస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన 28 ఏళ్ల లోకేశ్వరి పిట్టు లుకేమియాతో (బ్లడ్ క్యాన్సర్) సుదీర్ఘంగా పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న లోకేశ్వరి మరణవార్త.. ఆమె స్వస్థలం పిట్టువారిపాలెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆమె అమెరికాలోని నార్త్‌వెస్ట్ మిస్సోరి స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆ వెంటనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించారు. అంతా సాఫీగా సాగుతోందని, కూతురు అమెరికాలో బాగా సెటిల్ అయిందని ఆ తల్లిదండ్రులు సంతోషపడేలోపే విధి చిన్నచూపు చూసింది. లోకేశ్వరి లుకేమియా బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించారు.
చివరి క్షణం వరకు పోరాటం
గత కొంతకాలంగా ఈ ప్రాణాంతక వ్యాధితో ఆమె ఎంతో ధైర్యంగానే పోరాడారు. అమెరికాలో అత్యుత్తమ ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ, పరిస్థితి క్రమంగా విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి బెడ్‌పై చివరి శ్వాస వరకు ఆమె ఎంతో మనోధైర్యంతో క్యాన్సర్‌ను ఎదిరించినట్లు తెలుస్తోంది. చేతికొచ్చిన కూతురు ఇక లేదనే వార్త విని లోకేశ్వరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామం పిట్టువారిపాలెం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తోటి ఎన్నారైలు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ విషయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నారు. వీలైనంత త్వరగా అమెరికా నుంచి మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.


