స్టార్ల పారితోషికాలు.. పాన్ ఇండియా పిచ్చి : టాలీవుడ్ బతకాలంటే.. ఈ తప్పులు సరిదిద్దుకోవాల్సిందే!

ముఖ్య అంశాలు

  • సినిమా బడ్జెట్‌లో 75 శాతం పారితోషికాలకే పోతుండటంతో కంటెంట్, ప్రమోషన్లకు నిధులు కరువై నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
  • పాన్ ఇండియా మోజులో స్టార్ హీరోలు ఏళ్ల తరబడి గ్యాప్ ఇవ్వడం, విపరీతంగా పెరిగిన టికెట్ రేట్ల వల్ల ప్రేక్షకుల్లో థియేటర్లకు వెళ్లే అలవాటు సన్నగిల్లుతోంది.
  • ఓటీటీ విండోను ఎనిమిది వారాలకు పెంచి, హీరోలు ‘ప్రాఫిట్ షేరింగ్’ (లాభాల్లో వాటా) పద్ధతికి మారితేనే టాలీవుడ్ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న వివాదం చూస్తుంటే.. ఇది కేవలం థియేటర్ల ఆదాయం, రెంట్లు, కలెక్షన్ల పంపకాల గొడవ లాగే అనిపిస్తుంది. కానీ, తెర వెనుక అసలు కథ వేరే ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది సాధారణ సమస్య కాదు, ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిర్మాణాత్మక లోపాల ఫలితం. సినిమా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయినా.. టాలీవుడ్ ఇంకా పాత అలవాట్లతోనే ప్రయాణిస్తుండటమే ఈ సంక్షోభానికి అసలు కారణం.

సమస్య టికెట్ రేట్ల దగ్గర మొదలు కాలేదు, బడ్జెట్ కంట్రోల్ తప్పడం దగ్గర స్టార్ట్ అయింది. ఒక సినిమాకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పుకోవడం కాగితాల మీద గొప్పగా అనిపించవచ్చు. కానీ, అందులో దాదాపు 75 శాతం కేవలం హీరోలు, దర్శకులు, హీరోయిన్ల పారితోషికాలకే వెళ్లిపోతోంది. మిగిలిన పాతిక శాతంతో మేకింగ్, వీఎఫ్ఎక్స్, ప్రమోషన్స్ నెట్టుకురావాల్సి వస్తోంది. భారీగా పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టేందుకు నిర్మాతకు ఉన్న దారులు మూడే.. టికెట్ రేట్లు పెంచడం, థియేట్రికల్ హక్కులు ఎక్కువకు అమ్మడం, లేదా ఓటీటీకి త్వరగా ఇచ్చేయడం. కోవిడ్ తర్వాత ఓటీటీలు భారీ రేట్లు ఇస్తున్నాయని హీరోలు, దర్శకులు తమ పారితోషికాలను అమాంతం పెంచేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ పడిపోయింది, థియేటర్లకు జనం రావడం తగ్గింది.. అయినా రెమ్యునరేషన్లు మాత్రం కిందకు దిగడం లేదు.

పెరిగిన బడ్జెట్ భారాన్ని మోయాల్సింది ప్రేక్షకుడే అన్నట్లుగా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఒక సాధారణ కుటుంబం సినిమాకు వెళ్లాలంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాలుగైదు వారాలకే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో స్థిరపడిపోయింది. అందుకే, సినిమాకు ఏమాత్రం యావరేజ్ టాక్ వచ్చినా.. థియేటర్‌కు వెళ్లకుండా ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా మొదట థియేటర్ల కోసమే తీయాలి అనే ప్రాథమిక సూత్రాన్ని ఇండస్ట్రీ మర్చిపోయి చాలా కాలమైంది.

పాన్ ఇండియా మాయ.. మిస్సవుతున్న కోర్ ఆడియన్స్

టాలీవుడ్‌ను కలవరపెడుతున్న మరో అతిపెద్ద అంశం ‘పాన్ ఇండియా’ పిచ్చి. ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలనే రూల్ ఏమీ లేదు. రాజమౌళి లాంటి వాళ్లు తీస్తే వర్కౌట్ అయింది కదా అని, ప్రతి కథకూ పాన్ ఇండియా ట్యాగ్ తగిలించడం వల్ల అసలుకే మోసం వస్తోంది. ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించాలనే ఆరాటంలో మన నేటివిటీని, కోర్ ఎమోషన్‌ను గాలికి వదిలేస్తున్నారు. దీనికి తోడు ఈ భారీ క్యాన్వాస్ కోసం స్టార్ హీరోలు ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకుంటున్నారు.

పాన్ ఇండియా డేటా తీసి చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (జనవరి 2024) విడుదలై అప్పుడే రెండేళ్లు దాటేసింది. రాజమౌళితో ఆయన చేస్తున్న సినిమా రిలీజ్ కావడానికి కనీసం ఇంకో ఏడాదైనా పడుతుంది. అంటే ఒక స్టార్ హీరో సినిమా కోసం అభిమానులు, థియేటర్ ఓనర్లు దాదాపు మూడేళ్లు పైనే ఎదురుచూడాలి! ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికొస్తే.. ‘పుష్ప 2’ (డిసెంబర్ 2024) వచ్చి అప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ల లైనప్ చూసినా.. ఏళ్ల తరబడి నిరీక్షణే కనిపిస్తోంది.

స్టార్ హీరోలు ఎలాగూ లేరు.. పోనీ టైర్-2 హీరోలైనా ఇండస్ట్రీని ఆదుకుంటున్నారా అంటే అదీ లేదు. సాయి ధరమ్ తేజ్, అఖిల్, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు తెరపై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. ఏడాదో సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు కూడా ఇప్పుడు స్పీడ్ బాగా తగ్గించేశారు. ఇలాంటి కరువు కాలంలో శ్రీవిష్ణు లాంటి మిడ్-రేంజ్ హీరో, అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ మాత్రమే ఏడాదో ప్రాజెక్ట్ చేస్తూ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు.

నిజానికి ఇది ఇండస్ట్రీకే ప్రాణసంకటం లాంటి ట్రెండ్. ఒకప్పుడు పండగకో, కనీసం రెండు మూడు నెలలకో స్టార్ హీరో సినిమా థియేటర్లలో పడేది. ఆ సందడే వేరు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రాన్స్‌లో పడి మన హీరోలు రెండేళ్లకో, మూడేళ్లకో వస్తుంటే.. సగటు ప్రేక్షకుడికి “థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలి” అనే అలవాటే మెల్లగా చచ్చిపోతోంది. హీరోల క్యాలెండర్లు ఖాళీగా ఉంటే.. ఎగ్జిబిటర్ల కౌంటర్లు కూడా ఖాళీగానే ఉంటాయి.

పరిష్కారం ఎటువైపు?

ఈ విషవలయం నుంచి టాలీవుడ్ బయటపడాలంటే ముందుగా పగ్గాలు నిర్మాత చేతుల్లోకి రావాలి. హీరోలు, దర్శకులు భారీగా ఫిక్స్‌డ్ పారితోషికాలు తీసుకోవడం మానేసి, ప్రాఫిట్ షేరింగ్ (లాభాల్లో వాటా) పద్ధతికి మారాలి. అప్పుడే సినిమా ఫలితంపై అందరికీ బాధ్యత ఉంటుంది, నిర్మాతపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఆ మిగిలిన బడ్జెట్‌ను సరైన స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌పై, క్వాలిటీ మేకింగ్ మీద ఖర్చు పెట్టొచ్చు.

అలాగే ఓటీటీ రిలీజ్ విండోను కచ్చితంగా ఎనిమిది వారాలకు పెంచాలి. టికెట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంచాలి. స్టార్ హీరోలు ఈ లాంగ్ గ్యాప్‌లకు స్వస్తి పలికి కనీసం ఏడాదికో సినిమా ప్లాన్ చేసుకోవాలి. ప్రేక్షకుడి అరచేతిలో ప్రపంచ స్థాయి కంటెంట్ ఉన్న ఈ కాలంలో.. కేవలం స్టార్ డమ్, పాన్ ఇండియా అనే ట్యాగ్‌లు వారిని థియేటర్లకు రప్పించలేవు. హైప్ మీద కాకుండా కంటెంట్ మీద, పారితోషికాల మీద కాకుండా రికవరీ మీద దృష్టి పెట్టిన రోజే టాలీవుడ్ మళ్లీ పూర్వ వైభవాన్ని చూస్తుంది.

Exit mobile version