థియేటర్లలో బొమ్మ పడబోతుందోచ్..!

థియేటర్లలో బొమ్మ పడబోతుందోచ్..!

Published on Jul 6, 2021 12:24 AM IST


కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత నెలలో లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా సినిమా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో తెర్చుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. అయితే కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న క్రమంలో అసలు ఇప్పుడు థియేటర్లను తెరిచినా ప్రేక్షకులు వస్తారా అన్న ప్రశ్న థియేటర్ల యాజమాన్యంతో సహా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీనే కలవరపెడుతుంది. ఈ భయంతోనే షూటింగ్స్ పూర్తైనా చాలా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లను ప్రకటించేందుకు భయపడుతున్నారు.

ఇదిలా ఉంటే సినిమా థియేటర్ల పున:ప్రారంభంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలో నేడు టాలీవుడ్ నిర్మాత‌ల మండ‌లితో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మావేశ‌మయ్యారు. ఈ స‌మావేశానికి నిర్మాత‌లు దిల్ రాజు, సురేశ్ బాబు, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ భేటీలో థియేటర్ల విద్యుత్, నిర్వహణ ఛార్జీల రద్దు, పార్కింగ్ ఫీజు వసూలు సహా మరిన్ని రాయితీలు కల్పించాలని నిర్మాతలు కోరగా దానికి సీఎస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జూలై 8 నుంచి తెలంగాణలో 100 శాతం సామర్ధ్యంతో థియేటర్లు తెరుచుకోనున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు