ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – కొన్నాళ్ళ తర్వాత పెళ్ళనేదే ఉండదు!

ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – కొన్నాళ్ళ తర్వాత పెళ్ళనేదే ఉండదు!

Published on May 6, 2015 1:21 PM IST

rgv1
రామ్ గోపాల్ వర్మ అంటే ఓ వివాదం, రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగు సినిమాకు ఓ కొత్త దారిని చూపిన మాస్టర్ ఫిల్మ్‌మేకర్. క్రైమ్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లలో సినిమాలు తీసిన వర్మ, తాజాగా రొమాన్స్ జానర్లో ‘365 డేస్’ పేరుతో ప్రేమ, పెళ్ళి మధ్య నడిచే ఓ డిఫరెంట్ కథను తెరకెక్కించడంతో అందరిలోనూ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. నందు, అనైక సోతి జంటగా నటించిన ఈ సినిమా మే 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) హలో అండీ వర్మ గారు. ఏంటీ కొత్తగా ప్రేమ, పెళ్ళి అనే నేపథ్యాన్ని ఎంచుకున్నారు?

స) పెళ్ళి అనే కాన్సెప్ట్‌లో ఇద్దరు వ్యక్తులు ఎక్కువకాలం కలిసి ఉండలేరనేది నా అభిప్రాయం. పెళ్ళైన కొన్నాళ్ళకు మన ఇష్టాలకు, అవతలి వ్యక్తి ఇష్టాలకు మధ్య తేడాలొస్తాయ్. దాంతో ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ పెరిగేకొద్దీ ఆ బంధం బ్రేకప్‌కి దగ్గరైపోతుంది. విడిపోవడానికి గల కారణాలు సిల్లీగా కనిపించినా.. అదే నిజం. నా ‘365 డేస్’ సినిమాలో కూడా అదే చూపించా. నిజానికి ఇలాంటి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే ఈ సినిమా తీసిన తర్వాత నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నా.

ప్రశ్న) అంటే.. ఈ సినిమా ద్వారా పెళ్ళి వద్దని చెబుతున్నారా?

స) నేనెప్పుడూ జడ్జిమెంట్ ఇవ్వను. అది నా పని కాదు. నా జీవితం, నా చుట్టూ ఉన్న జీవితాలు, సమాజం నుంచి పుట్టిన కథే ఈ సినిమా. ఈ సినిమా ద్వారా ‘పరిస్థితి ఇలా ఉంది’ అని చెప్పడమే తప్ప ఎక్కడా జడ్జిమెంట్ లాంటిది ఇవ్వలేదు. ‘నువ్వు లేకపోతే నేను లేను’ అన్నంతగా ప్రేమించుకున్న ఓ జంటకు పెళ్ళైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయ్? అనే ఆలోచనతో ఈ సినిమా తీశా. వారిద్దరి ఎమోషనల్ ట్రావెల్‌ను ఈ సినిమాలో చూపించా.

ప్రశ్న) ప్రేమ – పెళ్ళి అనే కాన్సెప్ట్ కి ‘365 డేస్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

స) నా దృష్టిలో ఓ మనిషి విషయంలో మనం ఎగ్జైటై వారికి దగ్గరవ్వడం, వారితో జరిపే ఓ ప్రయాణం, వాళ్ళ ఆలోచనలు తెల్సుకోవడం లాంటివి జరగడానికి దాదాపుగా ఓ సంవత్సరం పడుతుంది. ఈ సమయంలోనే మనకు మొదట్లో ఉండే ఎగ్జైట్‌మెంట్ రానురానూ తగ్గిపోతూ ఉంటుంది. ఓ సంవత్సరం దాటిన తర్వాత ఆ ఎగ్జైట్‌మెంట్ పూర్తిగా పోయి రియాలిటీలోకి వచ్చి పడతాం. ఇక ఆ తర్వాత ఆ జంట కలిసి ఉండలేరనేది నా అభిప్రాయం. అందుకే ఈ సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్‌గా భావించి.. ‘365 డేస్’ అని పెట్టా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందా?

స) కచ్చితంగా. ఓ యాభై శాతం వరకూ ఈ సినిమా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే! మిగతా పోర్షన్ కూడా నాకు తెల్సిన వ్యక్తుల జీవితాల నుంచి తీసుకున్నదే! ఇకపోతే ప్రతి వ్యక్తీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఒకటే అని నా అభిప్రాయం. ఈ పెళ్ళి, విడిపోవడం ఇదంతా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఒక్కోరకంగా జరిగినా ఓవరాల్‌గా అందరిదీ ఒకే రకమైన ఎమోషన్. అందుకే ఈ సినిమాకు ఎవ్వరైనా కనెక్ట్ కాగలరు.

ప్రశ్న) మీ ఉద్దేశంలో ఫ్యూచర్‌లో పెళ్ళనేది ఉంటుందా?

స) (నవ్వుతూ..) ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఒక పర్సనల్ జోన్ ఏర్పరచుకొని బతుకుతున్నారు. ఆ జోన్‌లోకి లైఫ్ పార్ట్‌నర్ రావడానికి కూడా ఇష్టపడని రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు మారడమో, అడ్జస్ట్ అవ్వడమో జరగని పని. అందుకే కొన్నాళ్ళ తర్వాత అసలు పెళ్ళనేదే ఉండదు. ఇప్పుడిప్పుడే సహజీవనం అనే కాన్సెప్ట్ బాగా పెరిగింది. త్వరలోనే వీకెండ్ రిలేషన్ షిప్స్ లాంటివి ఇక్కడ కూడా వచ్చేస్తాయి. నన్నడిగితే నేను అవర్లీ రిలేషన్ షిప్ కోరుకుంటా. (గట్టిగా నవ్వుతూ..)

ప్రశ్న) మొదటిసారి మీ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది కదా.. ఎలా ఉంది?

స) ఇది నాకే కొత్తగా అనిపించింది. నిజానికి నాకు ఏ సర్టిఫికెట్ వచ్చినా పెద్దగా పట్టింపేమీ లేదు. ఇప్పటివరకూ క్రైమ్, హర్రర్ నేపథ్యంలోనే ఎక్కువ సినిమాలు తీయడంతో నేను క్లీన్ ‘యు’ అనేది ఎప్పుడూ చూడ్లేదు. ఇది నాకే షాకింగ్ ఎక్స్‌పీరియన్స్.

ప్రశ్న) మీరు పెళ్ళి అనే బంధం నుంచి బయటకొచ్చి ఇన్నేళ్ళయింది కదా. అప్పటికి, ఇప్పటికీ ఏదైనా మార్పు ఉందా?

స) కచ్చితంగా ఉంటుంది. అప్పట్లో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచించాను. ఇప్పుడు నా భార్య ఆ సమయంలో ఏం ఆలోచించి ఉంటుందనేది కూడా ఆలోచించగలుగుతున్నా. ఆ సమయంలో నేనెంత కరెక్టో, తనూ అంతే కరెక్ట్. కాకపోతే అప్పట్లో మనకు అవతలి వ్యక్తి కరెక్టన్న ఆలోచన కూడా వచ్చి ఉండదు.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ మారిపోతున్నాడా అనే ఫీలింగ్ కలుగుతోంది. దీనిపై మీ కామెంట్.?

స) (నవ్వుతూ..) ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే నా అభిప్రాయాలు, ఆలోచనలు మాత్రం మారిపోతూ ఉన్నాయి. నేను చెండాలమైన మనిషిని. ఇప్పుడే మామూలు మనిషిగా మారే ప్రయత్నం చేస్తున్నా.

ప్రశ్న) ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇప్పుడు చిన్న సినిమాలే చేస్తున్నారెందుకు?

స) ‘ఇది చిన్న సినిమా’, ‘ఇది పెద్ద సినిమా’ అనే గిరి గీసుకొని నేనెప్పుడూ సినిమా చేయను. ఒక కథ అనుకుంటాం, దాని స్కేల్ బట్టి బడ్జెట్ ఉంటుంది. అంతేగానీ పనిగట్టుకొని పెద్ద సినిమాయే చేయాలనే ఆలోచన నాకు లేదు. నా తరువాతి సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ ఓ యాక్షన్ థ్రిల్లర్. ఆ సినిమాకున్న స్కేల్‌కి, కథ నేపథ్యానికి కచ్చితంగా ఎక్కువ ఖర్చవుతుంది. అంతేతప్ప కావాలని బడ్జెట్ పెంచితే ఏం ప్రయోజనం? సినిమా విజయం సాధిస్తే.. చిన్న సినిమాయే పెద్ద సినిమా అవుతుంది.

తాజా వార్తలు