ఈ వారం.. డబ్బింగ్ సినిమాలదే..!

ఈ వారం.. డబ్బింగ్ సినిమాలదే..!

Published on Mar 12, 2015 1:00 PM IST

chirunavala-chirujalu-and-d
ఏ సినీ పరిశ్రమకైనా ఫిబ్రవరి చివరి వారం నుంచి, మార్చి చివరి వారం వరకూ బిజినెస్ డల్‌గానే కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యార్థులందరికీ పరీక్షలొచ్చి పడడం, వారితో పాటే ఫ్యామిలీస్ కూడా సినిమాను పక్కన పెట్టేయడం జరిగిపోతుంటుంది. అసలే మాములుగా సాగే బిజినెస్, వరల్డ్ కప్ ప్రభావంతో ఇంకా డల్ అయింది. కొన్ని బాగున్న చిత్రాలు ఆడుతున్నా, కొంచెం నెగెటివ్ టాక్ ఉన్న సినిమాలైతే పూర్తిగా చతికిలబడ్డాయి. అందుకే ప్రస్తుతానికి ఏ పెద్ద సినిమా పోటీకి దిగలేదు. ఇక ఇప్పుడే సరైన సమయమని భావించాయో ఏమో కానీ, ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా విడుదలకు నోచుకోని డబ్బింగ్ సినిమాలు ‘డాక్టర్ సలీమ్’, ‘చిరునవ్వుల చిరుజల్లు’లు థియేటర్ల ముందుకు వచ్చేస్తున్నాయి. తమిళంలో మంచి హీరోగా పేరున్న జీవాకు ‘రంగం’ వంటి సినిమా ద్వారా తెలుగులోనూ కొంత మార్కెట్ ఉంది. 2013 చివర్లో విడుదలై మంచి విజయం సాధించిన ‘ఎండ్రెండుమ్ పున్నగై’ సినిమాను చిరునవ్వుల చిరుజల్లు పేరుతో తెలుగులో ఎప్పట్నుంచో విడుదల చేయాలనుకున్నా ఇప్పటి వరకూ అది కుదర్లేదు. ఇక సలీమ్ పేరుతో థ్రిల్లర్‌గా రూపొందిన తమిళ సినిమా కూడా ఇప్పటికి తెలుగులో విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలూ అక్కడ ఘన విజయం సాధించి ఉండడం వాటికి కలిసివచ్చే అంశం.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రధానంగా రాజేంద్రప్రసాద్ టామీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాతో పాటు జగన్నాటకం, తప్పటడుగు, సచిన్, హీరోయిన్ వంటి సినిమాలు విడుదలవుతున్నా అవన్నీ అరకొర థియేటర్లతో సర్దుకుపోయిన సినిమాలే! పెద్దగా బిజినెస్ లేకున్నా పోటీ మాత్రం డబ్బింగ్ సినిమాల మధ్యనే ఉండబోతోంది. వాటికి ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా ఇక గత వారం సినిమాలతోనే ప్రేక్షకుడు సరిపెట్టుకునే అవకాశం కల్పించినట్టవుతుంది.

తాజా వార్తలు