ఏపీ సీఎం కు టాలీవుడ్ నిర్మాతల మండలి లేఖ.!

ఏపీ సీఎం కు టాలీవుడ్ నిర్మాతల మండలి లేఖ.!

Published on May 28, 2020 2:15 AM IST

తాజాగా టాలీవుడ్ సినిమాల షూటింగులకు తెలంగాణా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరు సహా పలువురు దర్శక నిర్మాతలు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించి సానుకూలమైన పరిస్థితులను గైకొనగలిగారు. అలాగే ఇప్పుడు ఏపీలో కూడాతెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేయూతను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికు నిర్మాతల మండలి ఓ లేఖను అందివ్వడం జరిగింది.

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరింది.

అందులో భాగంగా మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ ముఖ్యమంత్రికి బుధవారం లేఖ రాయగా జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వగా వారు ప్రత్యేకకృతజ్నతలు తెలియచేశారు.

అలాగే అప్పట్లో చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని, అలాగే నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని వారు గుర్తు చేశారు.

అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి పరిశ్రమ వర్గాలకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని వారు ఈ లేఖ ద్వారా కోరడం జరిగింది. అయితే ఈ లేఖను ఏపీ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డికి, ఛైర్మన్ విజయ చందర్ కు కూడా అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు