సూర్య-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా?

trivikram-with-suriya
తమిళ సూపర్ స్టార్ సూర్య, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ అంటే వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ! ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం చాన్నాళ్ళ నుంచే జరుగుతున్నా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయమై ఓ స్పష్టమైన అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. తన మాటల మ్యాజిక్‌తో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తాజా చిత్రం ‘S/O సత్యమూర్తి’ మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే!

ఆ తర్వాత త్రివిక్రమ్ తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలేవీ ఇప్పటికీ తెలియజేయలేదు. మహేష్ బాబు, నితిన్, సమంతతో లేడీ ఓరియంటడ్ సినిమా ఇలా రకరకాల కాంబినేషన్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయమై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక సూర్య-త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా వచ్చే ఏడాది జూలై నెలలో మొదలుకానుందని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం.

ప్రస్తుతం సూర్య వరుసగా మూడు సినిమాలకు కమిటై ఉన్నారు. త్రివిక్రమ్ కూడా త్వరలోనే ఓ సినిమాను మొదలుపెట్టేయనున్నారు. వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులను వచ్చే ఏడాది ఈ సమయానికల్లా పూర్తి చేసి స్టూడియో గ్రీన్ నిర్మించే భారీ సినిమాను మొదలుపెట్టనున్నారని సమాచారం. ఈ విషయమై ఇంకా ఓ ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Exit mobile version