విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై టాలీవుడ్‌లో మంచి క్రేజ్ నెలకొంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన క్లాసిక్ సినిమాల తరహాలోనే, ఈ చిత్రం కూడా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక అదిరిపోయే కామెడీ సీక్వెన్స్ గురించి ఫిలిం నగర్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా సినిమా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాల కామెడీ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందని సమాచారం. త్రివిక్రమ్ రాసిన డైలాగులకు, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సీన్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాకుండా, కథలో ఒక కీలక మలుపుగా ఈ సన్నివేశాన్ని డిజైన్ చేశారట.
కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో నారా రోహిత్ నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండటం విశేషం. వెంకటేష్, నారా రోహిత్ మధ్య వచ్చే గిల్లీకజ్జాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని తెలుస్తోంది. మరి వెంకీ కోసం త్రివిక్రమ్ హైలైట్ చేస్తున్న ఈ సీక్వెన్స్‌కు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


