
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటుకొని శనివారం సాయంత్రానికి విడుదలైంది. నిజానికి ఈ సినిమా శుక్రవారమే (మే 1న) విడుదల కావాల్సింది. చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఆరోజు విడుదలకు నోచుకోలేదు. ఇక విడుదల ఇప్పుడంటూ, అప్పుడంటూ చెలరేగిన గందరగోళం మధ్యే ఈ సినిమా శనివారం సాయంత్రం విడుదలైంది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా అనుకున్న రోజునే విడుదలైంది.
‘ఉత్తమ విలన్’ సినిమాకు విడుదల అయిన అన్ని చోట్లనుంచీ మంచి స్పందన వచ్చింది. సినీ విశ్లేషకుల నుంచి కూడా ఈ సినిమాపై మంచి స్పందనే వచ్చింది. ముఖ్యంగా కమల్ హాసన్ అందించిన కథకు అందరినుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. కమల్ హాసన్ నటన విషయంలో వంక పెట్టలేమన్నది అందరూ ఏక కంఠంతో చెబుతున్న అభిప్రాయం.
ఈ సినిమాకు మేజర్‌గా ఏ సెంటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఓవర్సీస్‌లో ఈ ప్రయోగానికి ప్రేక్షకులు అండగా నిలబడి కలెక్షన్లు కురిపిస్తున్నారు. ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ సినిమా తమిళ వర్షన్ అమెరికాలో సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశముంది. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆండ్రియా, పూజా కుమార్‌లు నటించారు.

