ఎంట్రీ ఇస్తూనే కొత్త రికార్డులు సృష్టించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. డెబ్యూ సినిమా ‘ఉప్పెన’తో ఏ హీరోకి దక్కని వసూళ్ల రికార్డుల్ని ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క సినిమాతోనే హాట్ షాట్ అయిపోయాడు. మెగా ఫ్యామిలీ వారసుల్లో చరణ్ తర్వాత ఎంట్రీలోనే ఇంత క్రేజ్ దక్కించుకున్నది వైష్ణవ్ తేజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం చాలా పెద్ద బ్యానర్లు ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి. మొదటి సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు వైష్ణవ్ తేజ్.
షూటింగ్ పూర్తైన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక తాజాగా కొత్త సినిమాను షురూ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఇది కూడ రొమాంటిక్ ఎంటర్టైనరే. ఇందులో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇది కాకుండా నాగార్జున బ్యానర్లో కూడ వైష్ణవ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు.


