ఫ్యాన్స్ లేకుండానే ‘వకీల్ సాబ్’ వేడుక ?

Published on Mar 31, 2021 5:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. తమ అభిమాన హీరోను మూడేళ్ళ తర్వాత థియేటర్లలో చూడబోతున్నామనే ఉత్సాహంలో ఉన్నారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ట్రైలర్ చూడటానికి అభిమానులు ఎగబడిన తీరు చూస్తే ఏప్రిల్ 9 విడుదల రోజున ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. ఇక సినిమా ప్రీరిలీజ్ వేడుక మీద కూడ ఫ్యాన్స్ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఒకే వేదిక మీద చిరు, పవన్, రామ్ చరణ్ ముగ్గురినీ ఒకేసారి చూడవచ్చని అనుకున్నారు.

కానీ వాళ్ళ కోరిక నెరవేరేలా లేదు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల మందితో ఈవెంట్ అంటే కష్టమని భావించిన హైదరాబాద్ సిటీ పోలీసులు అనుమతులు ఇచ్చే ఆలోచనలో లేరట. అందుకే చిత్ర బృందం వేడుకను అభిమానులు లేకుండానే నిర్వహించాలని చూస్తున్నారట. ఏదైనా స్టార్ హోటల్లో సినిమా బృందం, కొంతమంది ముఖ్య అతిథుల సమక్షంలో మాత్రమే వేడుక నిర్వహించాలని, కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే అయినా కోవిడ్ నిబంధనలను అనుసరించి ఆమోదించక తప్పదు.

సంబంధిత సమాచారం :